గోవా జానపద నృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోవా జానపద నృత్యాలు వేల సంవత్సరాల సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి, గోవా సమాజంలోని వివిధ వర్గాల, మతాలు మరియు కులాల జీవనశైలి, సంస్కృతులు మరియు ఆకాంక్షలను ప్రతిబింబించే అసంఖ్యాక నృత్య రూపాలు గోవాలో ప్రదర్శించబడతాయి.సాంప్రదాయ మరియు ఆధునిక సంగీతం యొక్క అరుదైన సమ్మేళనం అయిన డెక్ని వంటి అనేక సాంప్రదాయ నృత్యాలను మహిళలు ప్రదర్శిస్తారు. ఫుగ్డి మరియు ధాలో గోవాలో తరచుగా ప్రదర్శింపబడె అత్యంత సాధారణ జానపద నృత్యాలు.కుంబీ ఒక గిరిజన జానపద నృత్యం. షిగ్మో పండుగ సందర్భంగా తలపై దీపాలు పట్టుకుని దీప నృత్యం చేస్తారు .షిగ్మో సమయంలో వెనుకబడి న సామాజిక వర్గం ప్రదర్శించే మరొక సాంప్రదాయ జానపద నృత్యం మోరులెం.జాగోర్ అనేది గోవాలోని వివిధ గ్రామాలలోగౌడ సామాజికవర్గం ]ప్రదర్శించే జానపద నాటకం.నవరాత్రి సమయంలో అత్యంత ఆకర్షణీయమైన ధంగర్ ఆరాధన మరియు నృత్యం ఆ సమావేశ కాలం ]లో ఎంతో ఉత్సాహంతో ప్రదర్శింపబడుతుంది.మండో అనేది భారతీయ మరియు పాశ్చాత్య సంప్రదాయాల కలయికను సూచించే ప్రేమ పాట.[1]

1.ధలో నృత్యం(Dhalo Dance)[మార్చు]

ధలో నృత్యం

ప్రధానంగా గోవాలోని మహిళా జానపదులచే ప్రదర్శించబడే నృత్యం ధలో నృత్యం,ఇది గోవా రాష్ట్రంలోని ప్రముఖ నృత్య రూపాలలో ఒకటి. ప్రజల డిసెంబర్ మరియుజనవరి నెలలకు అనుగుణమైన పుష్య మాసంలేదా హిందూ మాసంలో ధలో నృత్యం చేస్తారు.నాట్య క్రతువులో భాగంగా, మహిళలు రాత్రి భోజనం చేసిన తర్వాత చుట్టూ చేరి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.మహిళలు/నర్త కులు ఒకరికొకరు ఎదురుగా 2 వరుసలను ఏర్పరుస్తు నిల్చుంటారు ఒక్కొక్క నృత్య బృందం 12 మంది నృత్యకారులతో రూపొందించబడుతుంది.మహిళలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, ప్రశాంతమైన వదనాలతో నర్తిస్తుంటే చూపరులకు నయన మనోహరంగా ఉంటుంది ఆదృశ్యం.జానపద మరాఠీ మరియు కొంకణి పాటలతో నృత్యం ఉంటుంది. ఈ నృత్యం కనులకింపైన దృశ్యం.[2]హిందువుల క్యాలెండర్ ప్రకారం చలికాలం ప్రారంభంలో, పౌషా కాలంలో ధలో నిర్వహిస్తారు. పౌర్ణమి పండుగ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఆధారపడి ఐదు నుండి తొమ్మిది రోజుల పాటు నృత్యం చేస్తారు. ధాలో నృత్యం యొక్క ఇతివృత్తం ప్రధానంగా మతపరమైన మరియు సామాజికమైనది.

ధలో డ్యాన్స్ అనేది ఆచారాలు మరియు కళల సమ్మేళనం, ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ధాలో నృత్యాన్ని మాండ్ అని పిలువబడే పవిత్ర స్థలంలో నిర్వహిస్తారు.ప్రజలు పాదరక్షలతో ప్రవేశించడానికి అనుమతించబడరు. ఈ పండుగ పౌర్ణమి రోజున మొదలవుతుంది, దీనిని స్థానికంగా "దల్యాచి పూనవ్" అని కూడా పిలుస్తారు.పండుగ ముగింపులో, ‘రంభ’ అనే చిన్న నాటకం/ప్రదర్శన జరుగుతుంది,ఈ కథనంలో, ఇరవై ఒక్క రంభ సోదరీమణులు తమ ఏకైక సోదరుడిని కలవాలని కోరుకుంటారు. సోదరీమణుల వయస్సు పద్నాలుగు నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు.అందరూ డాబా మీదకి వెళ్లి తమ అన్నయ్యని పిలుస్తున్నారు. వారి పిలుపుతో సోదరుడు చప్పరం(terrace) కనిపిస్తాడు మరియు అందరూ అతనిని కలుస్తారు. ధాలో నృత్య రూపంలో ఇది ఏకైక పురుష పాత్ర భాగం.ఇది తప్ప మరే పురుష వ్యక్తి పాల్గొనడు. పురు పాత్రను "బాంధవ్" అని పిలుస్తారు

సమూహంలోని ప్రధాన మహిళ భూమాతకు నమస్కరిస్తూ, వారి నృత్యం మరియు పండుగ యొక్క ఆచారాలను ఆశీర్వదించమని కోరడంతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.తమ గ్రామాన్ని ఎలాంటి హాని జరగకుండా కాపాడాలని,ఎలాంటి చెడుశకునాలు లేకుండా పండుగను పూర్తి చేయాలని ఆమె ప్రకృతి మాతను కోరుతుంది.పన్నెండు నుండి పద్నాలుగు మంది మహిళలు ప్రదర్శనలో పాల్గొంటారు. వారు రెండు వరుసలలో చేతులు జోడించి నృత్యం చేస్తారు.నృత్య ప్రదర్శన సమయంలో స్త్రీలు చేతులు జోడించి నమస్కరిస్తారు.కదలికలు నెమ్మదిగా మరియు మృదువుగా ఉంటాయి, అయితే వారు నృత్యం చేసేటప్పుడు మహిళల ఉత్సాహాన్ని కూడా చూపుతారు.ప్రతి వరుస మరొక వరుస తర్వాత వంగి ఉంటుంది. ఆచారంలో భాగంగా స్త్రీలు పురుషులరేఖా చిత్రాలు గీయడంతో నృత్యం ముగుస్తుంది. ప్రదర్శన యొక్క చివరి రోజున, "మండ్ షింపనే" అని పిలువబడే "మాండ్" మీద నీరు చిలకరించడంతో నృత్యం ముగుస్తుంది.[3]

2.కొరెడిన్హో నృత్యం(corredinho Dance)[మార్చు]

గోవాలోని కొరిడిన్హో నృత్యం గోవాలో పోర్చుగీసు పాలనలో ప్రవేశపెట్టబడింది.ఈ నృత్యం ప్రధానంగా సమాజంలోని ధనిక మరియు ఉన్నత వర్గానికి వీక్షించడం మరియు వినోదం కోసం కేటాయించబడింది.ఇది ఒక పురుషుడు మరియు స్త్రీ 6 జంటలుగా ఏర్పాడి చేసే జంటనృత్యం. నృత్యకారులు తమ ఉత్తమమైన, సాంప్రదాయకంగా రంగురంగుల వస్త్రాలను ధరిస్తారు,ఈ మొత్తం నృత్య ప్రదర్శనను చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది.దీనిని తరచుగా గోవా ఎలైట్ యువకులు జానపద రైతుల నృత్యంగా కూడా పిలుస్తారు.ఈనృత్యం గోవాలో అందమైన పోర్చుగీస్ సాంస్కృతికి ప్రాతినిధ్యం.[2] ఈ నృత్యం గోవా నృత్యాలలో ప్రసిద్ధి చెందిం. పోర్చుగీస్ సాంస్కృతిక ప్రభావానికి అందమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది.కొరిడిన్హో అనేది అల్గార్వే అనే పోర్చుగీస్ నృత్యం యొక్క ప్రసిద్ధ రూపంగా పరిగణిం చ బడుతుంది. ఇది జంటలచే ప్రదర్శించబడుతుంది, ఇందులో అమ్మాయిలు పొడవాటి స్కర్టులు మరియు జుట్టుకుకండువా కట్టుకుంటారు. అబ్బాయిలు టోపీని ధరిస్తారు.రంగురంగుల దుస్తులు కన్నుల పండువగా ఉంటాయి.కొరెడిన్హో మార్చా డి ఫాంటైన్హాస్ అనేది పాడటం మరియు నృత్యంతో కూడిన ఒక ప్రసిద్ధ జానపద కళ. [4]

3.దేఖ్నినృత్యం(dekhni Dance)[మార్చు]

దేఖ్నినృత్యం వగటూర్ లో

గోవాలోని స్థానిక మహిళలు ప్రదర్శించే జానపద నృత్యాల జాబితాను అనుసరించి, దేఖ్ని మరొ మహిళు ప్రాతినిథ్యం వహించే నృత్యం.కొంకణిలో దేఖ్ని అనే పదానికి అందం అని అర్థం.అయితే, ధాలో నృత్య రూపానికి భిన్నంగా ఈ నృత్యం దేవదాసి జీవితాన్ని చిత్రీకరించడానికి ప్రదర్శించబడుతుంది. దేవదాసి భావన పురాతన భారతదేశం నాటిది,అమ్మాయిలు దేవతలతో వివాహం చేసుకుని వారి జీవితమంతా అతనిని భర్తగా భావిస్తూ జీవితాన్ని గడపాలి అనేది ఆ ఆచారం. వారు తమ జీవితమంతా దేవాలయంలో స్వామికి లేదా దేవుడికి సేవ చేస్తారు.ఈ పురాతన గతం దేఖ్నిని గోవాలోని పురాతన నృత్య రూపాలలో ఒకటిగా చేసింది. ఇది సెమీక్లాసికల్ టచ్‌లతో (అర్ధ ప్రాచీన సంప్రదాయ లక్షణాలు) కూడిన అందమైన ఇండో-వెస్ట్రన్ డ్యాన్స్ రూపం.[2]

దేఖ్నినృత్య నేపధ్యం ఇతివృత్తం ఏమిటంటే, ఒక దేవదాసి అమ్మాయి పెళ్లిలో నృత్యం చేయడానికి ఒప్పందం ఉన్న నది అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి ఫెర్రీ( పడవ వంటిది)లో వెళ్లటానికి నదిఒడ్డుకు వస్తుంది.నదికి అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లమని ఆమె పడవ నడిపే వ్యక్తిని అభ్యర్థిస్తుంది.పడవ నడిపేవాడు తిరస్కరిస్తూ, నీటి ప్రవాహం ఎక్కువ వడితో ఉండటం వల్ల ప్రయాణం సురక్షితం కాదని చెప్పాడు.దేవదాసి అతనిని పరి పరి రకాల అభ్యర్థిస్తూనే ఉంటుందితనను అత్యవసరంగా తీసుకువెళ్లితే తన బంగారు చెవిపోగులను అతనికి ఇవ్వటానికి కూడా సంసిద్ధం తెలుపుతూంది.అప్పుడు మిగతా నృత్యకారులు,అమెకు మద్ధతుగా పడవ నడిపే వ్యక్తి కోసం నృత్యం చేస్తారు.అతను వారిని పడవలో వారిని అవతలి తీరం చేర్చుతాడు.

ఈస్త్రీలు-జానపదులచే ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది.ఈ నృత్యం పాశ్చాత్య లయలు మరియు భారతీయ శ్రావ్యత కలయికతో చేయబడింది.ఈ నృత్యంలోని కొన్ని హావభావాలు కథక్ మరియు భరత నాట్యం వంటి శాస్త్రీయ నృత్యాల నుండి తీసుకోబడ్డాయి.ఆడపిల్లకి మరియు పడవ నడిపే వ్యక్తికి మధ్య సాగే సంభాషణ ద్వారా అభినయం మనోహరంగా ఉంటుంది.నృత్యకారులు చిన్న ప్యాంటీ అనే దీపాలు తీసుకువెళతారు,అవి నూనెలో తేలియాడే వత్తితో కూడిన చిన్న మట్టి దీపాలు.చాలా కాలం క్రితం కంపోజ్ చేసిన రెండు మూడు దేఖ్నీ పాటలు మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉన్నాయి.ప్రదర్శకులు ఘుమత్ అనే జానపద డ్రమ్‌కు/డోలు అనుగుణంగా నృత్యం చేస్తారు.మొదటి దేఖ్నీ నృత్యాలలో ఒకటి కుక్స్తోబా దాదాపు 1869 నాటిది.ఈ పాట పోర్చుగీస్ పాలనకు ప్రతిఘటనను సూచించే heir to India and terror of Goa పాట.ఈ నృత్యం గోవా అంతటా ఎక్కువగా ప్రదర్శించబడుతుంది. [5]

4.ఫుగ్డి నృత్యం(fugdi dance)[మార్చు]

దక్షిణ గోవాలోఫుగ్డి నృత్య ప్రదర్సన

గోవాలోని మహిళలకు తమను తాము ఎలా ఆనందించాలో ఖచ్చితంగా తెలుసు. ఫుగ్డి గోవాలోని మరొక మహిళా-కేంద్రీకృత జానపద నృత్యం. మహిళల సమూహం తమను తాము వృత్తాకార వలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు.ఖచ్చితమైన సమకాలీకరణలో తిరుగుతారు.నృత్య ప్రదర్శనకు తోడుగా గాయకులు లేదా సంగీతకారులు వేరుగా ఎవ్వరు వుండరు. నృత్యకారులు తమలో తాము పాడుకుంటూ ఉత్సాహంగా మరియు విస్తారమైన పాద విన్యాసాలతో మరియు వివిధ రీతులలో నర్తిస్తూ ఆడతారు.ఈ నృత్యం కొన్ని ప్రధాన సంఘటనలు, సందర్భాలలో, మతపరమైన సమావేశాలు మరియు పండుగలలో ప్రదర్శించబడుతుంది. నృత్యం లోతైన సంకేత అర్థాన్ని కలిగి ఉంది, ఇక్కడ అది ప్రతి మనిషిలో దాగి ఉన్న అంతర్గత శక్తిని సూచిస్తుంది.[2]ఫుగ్డి అనేది గోవా యొక్క సాంప్రదాయ జానపద నృత్యం, ఇక్కడ కొంకణ్ ప్రాంతానికి చెందిన గోవా మహిళలు వ్రతాలు, గణేష్ చతుర్థి మరియు ఇతర హిందూ పండుగల వంటి మతపరమైన పండుగల సమయంలో ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు.ఈ సాంప్రదాయ నృత్య రూపాన్ని సాధారణంగా భాద్రపదంమాసంలో ప్రదర్శిస్తారు, గోవా మహిళలు తమ సాధారణ రోజువారీ పనులను విడిచిపెట్టి,పని విముక్తి చెంది,ఆనందించే అవకాశాన్ని ఫుగ్ది నృత్యప్రదర్ష్న వల్ల పొందుతారు.నృత్య రూపం గోవా సంస్కృతి యొక్క ప్రాచీన సంప్రదాయం నుండి ఉద్భవించింది. గోవాలోని షెపర్డ్ కమ్యూనిటీ(గొర్రెల కాపరి సమూహం/సమాజం అని పిలువబడే ధంగర్ మహిళలు ఈ రకమైన నృత్య రూపాన్ని ప్రదర్శిస్తారు.. వ్రత పండుగ సందర్భంగా మహాలక్ష్మి దేవి ముందు ఈ నృత్యం చేస్తారు. గోవాలో ఇది ఏకైక సాంప్రదాయ నృత్య రూపం, ఈనృత్యం చేయడానికి ఎలాంటి వాయిద్య మద్దతు అవసరం లేదు.ఈ నృత్య రూపంలో, గొర్రెల కాపరి సమాజానికి చెందిన మహిళలు తమ ప్రదర్శన ప్రారంభంలో హిందూ దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు మరియు బిగ్గరగా పాడుతూ నెమ్మదిగా నృత్యం చేస్తారు.ప్రతి సెకనుకు నృత్యం యొక్క లయ పెరుగుతుంది. నృత్యం పతాక స్థాయి చేరేసమయానికి, చేతుల, కాళ్ల వేగవంతమైన కదలికలతో నర్తిస్తూ మహిళలు 'ఫూ' అనే శబ్దంతో బిగ్గరగా ఊపిరి పీల్చుకుంటారు, అందుకే ఈ సంప్రదాయానికి ఫూగ్డి లేదా ఫుగ్డి అని పేరు పెట్టారు.సుదూర పట్టణం లేదా గ్రామం నుండి బావులు మరియు ఇతర నీటి గుంటల నుండి నీటిని తీసుకురావడం నుండి వారి విరామాన్ని సూచించే ఫుగ్డి నృత్యం, తమ చేతుల్లో కొబ్బరికాయలను పట్టుకుని కూడా ప్రదర్శించబడుతుంది.రహత్, జిమ్మా, గిర్కి, సైకిల్, బస్ ఫుగ్డి, కర్వార్, ఘుమా, కొంబ్డా మరియు పఖ్వా ఫుగ్డి నృత్యం యొక్క ఉప రూపాలు మరియు ఆయా గ్రామాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుగుడి నృత్యంగా పరిగణించ బడుతున్నాయి.[6]

5.దీపం నృత్యం(lamp dance)[మార్చు]

దీప నృత్యం

లాంప్ డ్యాన్స్ అనబడే దీప నృత్యం గోవాలోని అత్యంత కష్టమైన మరియు సవాలు చేసే నృత్య రూపాలలో ఒకటి. ఇది నైపుణ్యం, సమతుల్యత మరియు ప్రధాన బలాల కలయిక ప్రదర్శన. ఈ నృత్యం చేస్తున్న కళాకారులు తమ తలపై ఉన్న ఇత్తడి దీపాలను సమతుల్యం చేసుకుంటారు.జాగ్రత్తగా, నెమ్మదిగా మరియు లెక్కించిన కదలికలలో కదులుతారు ప్రదర్శన మొత్తం వీక్షకులకుఅద్భుతమైన అనుభ వాన్ని ఇస్తుంది.నృత్యకారులు వారి తలపై సంతులితం చేసే దీపాలు చాలా బరువుగా ఉంటాయి. మరియు ఈ దీపాలను ఏకకాలంలో సంతులితం చేస్తూ నృత్యం చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ,ఇది నృత్యకారుల అంకిత భావానికి నిదర్శనం.[2]దీప నృత్యం గోవాలోని ప్రసిద్ధ నృత్యాలలో ఒకటి మరియు దీనిని గోవా రైతు సంఘం ప్రదర్శిస్తుంది.మార్చి నెలలో షిగ్మో పండుగ సంద ర్భంగా నృత్యంలో ఉపయోగించే ఇత్తడి దీపాల నుండి ఈ నృత్యానికి ఆ పేరు వచ్చింది.లాంప్ డ్యాన్స్‌ను 'దివ్లయం నాచ్' అని కూడా పిలుస్తారు, ఈ నృత్యంలో ఉపయోగించే దీపం సాంప్రదాయ గోవా హస్తకళను సూచిస్తుంది.ఈ నృత్యం దక్షిణ మరియు మధ్య గోవాలో ప్రసిద్ధి చెందింది.దీప నృత్యం,నర్తకుల సమూహంగా ప్రదర్శించ బడుతుంది.దీనిని మగ మరియు ఆడ నృత్యకారులు ఇద్దరూ అభ్యసిస్తారు.నర్తకులు తలపై మరియు చేతులపై మండే వత్తులతో (దివ్లీ) ఇత్తడి దీపాలను బ్యాలెన్స్ చేస్తూ నెమ్మదిగా డ్యాన్స్ చేసే కదలికలో మునిగిపోతారు.తలపై దీపంపెట్టుకోవడంలో అద్భుతమైన జిమ్నాస్టిక్ నైపుణ్యాలు అవసరం. ప్రదర్శకులు వారి పనితీరులో అత్యంత నైపుణ్యం మరియు నైపుణ్యం కలిగి ఉండాలి. సాంప్రదాయ జాన పద గీతాల లయలతో చక్కటి పాద లయబద్ద కదలికల సమన్వయం వీక్షకుల/చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది.[7]

6.ధన్గర్ నృత్యం(dhangar dance)[మార్చు]

ధన్గర్ నృత్యం

గోవా యొక్క ధన్గర్ నృత్యం. శ్రీకృష్ణుడు తన సఖి/ ప్రేయసి రాధ తో జీవితం మరియు సన్నిహితంగా జంటగా గడిపిన సమయాలను స్మరించుకునే ఉత్తమ నృత్యంగా గా నిర్వచించవచ్చు.నవరాత్రి పవిత్ర సందర్భంగా గుజరాత్‌ లోని గొర్రెల కాపరి సమాజానికి చెందిన ప్రజలచే ఈ ధన్‌గర్ నృత్యం ద్వారా దైవిక కథ చెప్పబడుతుంది.కుటుంబ పెద్దలు నవరాత్రుల మొదటి రోజున ఈ నృత్యాన్ని ప్రారంభిస్తారు, తరువాతి రోజుల నుండి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారు.శ్రీకృష్ణుడు మరియు రాధ విగ్రహాలు గ్రామంలోని మధ్య ప్రదేశంలో ఉంచబడతాయి. ప్రజలు ఈవిగ్రహ ప్రతిష్ఠ స్థలం చుట్టూ గుమిగూడి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు,అత్యంత సరళమైన మరియు నెమ్మదిగా ఉండే నృత్య పాదకదలికలు కలిగిచుండి,గోవాలోని జానపద నృత్యాలలో ఒకటిగా భావించబడుతున్నది.[2]ధన్‌గర్స్ అని పిలవబడే గొర్రెల కాపరి సమాజం/సామాజిక వర్గంచే ప్రదర్శించబడే ఒక ప్రసిద్ధ గోవా నృత్య రూపం ఇది. ధన్గర్ నృత్యం నవరాత్రి నృత్యంగా పరిగణించబడుతుంది. బీరా దేవా లేదా "బిరుబా"ని అనే తమ దెవున్ని ప్రసన్నం చేసుకోవడానికి అయన శక్తిమంతమైన ఆశ్వీరాదం పొందతానికి ఆరాధించడానికి భక్తితో ప్రదర్శించె నృత్యం ఇది.ధంగార్ నృత్యాన్ని ధంగారి గజనృత్యం అని కూడా పిలుస్తారు, ఇందులో కతియావారి తరహా తెల్లటి దుస్తులు మరియు రంగురంగుల రుమాలు కూడిన దుస్తులను ధరించి, నెమ్మదిగా వాయిస్తున్నవాద్య వాయింపుకూనుగుణంగా సాధారణ పాద విన్యాసం తో నృత్యం ప్రారంభమవుతుంది. సాధారణంగా వారు నృత్యం సమయంలో డ్రమ్ /డోల్ వాయించె వాద్యకారుల చుట్టూ తిరుగుతారు.[8]

7.దశావతార నృత్యం(dashavatara dance)[మార్చు]

హిందూ పురాణాల ప్రకారం,దశావతారం అనే పదం విష్ణువు యొక్క 10 వేర్వేరు అవతారాలను సూచిస్తుంది. ఈనృత్యాన్ని స్థానిక పురుషులు మరియు గోవా మహిళలు ఇద్దరూ చేస్తారు.ముందుగా చెప్పినట్లుగా, ఈ నృత్యం విష్ణువు యొక్క 10 విభిన్న రూపాలను వర్ణిస్తుంది. నృత్యంలో లో విస్తృతమైన నృత్య దశలు, నిర్మాణాలు, నమూనాలు/రీతులు మరియు వర్ణనలు ఉంటాయి, ఈ నృత్య బృందం కథ చెప్పడంలో చూపించె నైపుణ్యత,వైవిధ్యత, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది.హిందూ కథలోని వివిధ పౌరాణిక పాత్రలు కూడా ఒక్కొక్కటిగా పరిచయం చేయబడతాయి.నర్తకులు వివిధ విష్ణువు అవతారాలను వర్ణించే సందర్భంలో ముఖానికి భారీగా రంగులు అద్దుతారు, ఆభరణాలు, కళాత్మకమైనతలపాగాలు మొదలైనవి ధరిస్తారు.[2]

విష్ణువు యొక్క పది అవతారాలు ఏమిటంటే,అవి మత్స్య (చేప),కూర్మం (తాబేలు), వరాహం (అడవి పంది), నరసింహ (సగం మనిషి & సగం సింహం),వామనుడు (మరగుజ్జు),పరశురాముడు, రాముడు, బలరాముడు మరియు కల్కి. అవి దశావతార నృత్యానికి ఆధారం.కొంతమంది ఈ నృత్యం "యక్షగానం" నుండి ఉద్భవించిందని నమ్ముతారు, మరికొందరు దీనిని "కూచిపూడి" నుండి ఉద్భవించారని భావిస్తారు.చాలా మంది నటీనటులు దశావతారము వాస్తవానికి కేరళ యొక్క నృత్య రూపమని నమ్ముతారు.వారు కేరళలోని వాలావల్ ప్రాంతానికి చెందిన దేవతను ఆరాధిస్తారు.రంగస్థల నాయకుడు అయిన 'సూత్రధర్' గణపతి కి అంకితం చేసె ప్రార్థనతో నృత్యం ప్రారంభమవుతుంది.అతను 'వేదాలు' దొంగిలించబడిన విషయాన్ని కూడా బిగ్గరగా & ఆశ్చర్యకరమైన పదాలతో చెప్తాడు. 'బ్రాహ్మణ' బొమ్మలు, నదులకు ప్రాతినిధ్యం వహించే మహిళా నటులు, బ్రహ్మదేవుడు (సృష్టికర్త) మరియు సరస్వతి దేవి (విద్యా దేవత) మరియు శంఖాసురుడు అనే రాక్షసుడు వంటి నటీనటులు నాటకంలో కొన్ని ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.నృత్య రూపం సంగీత నేపథ్యంతో కూడి ఉంటుంది. దాదాపు రెండు గంటల పాటు నాటకం కొనసాగుతుంది, దీని తర్వాత "అఖ్యానా" అని పిలవబడే సరైన నాటకం ప్రారంభమవుతుంది,ఇది ఇతిహాసాలు మరియు పౌరాణిక విశ్వాసాల కథలకు సంబంధించినది, సూర్యోదయ సమయంలో ప్రదర్శన ముగుస్తుంది. ఈ నృత్యంలో, కళాకారులందరి వేషధారణ చాలా మనోహరంగా ఉంటుంది.ముఖ అలంకరణ సాధారణంగా ఎరుపు మరియు తెలుపు రంగులను ఉపయోగించి చేయబడుతుంది.[9]

8.షిగ్మో నృత్యం(shigmo dance)[మార్చు]

షిగ్మో నృత్యంలో హారతిపళ్లెంతో కుర్రోడు

షిగ్మో లేదా రంగుల నృత్యం, గోవాలోని ప్రముఖ నృత్య రూపాలలో ఒకటి. గోవా జనాభాలో ఎక్కువ భాగం వ్యవసాయం చెస్తూ పంటలపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఈ నృత్యం కొత్త మరియు ఆరోగ్యకర మైన పంటలను స్వాగతించడానికి వసంత పంట కాలంలో ప్రదర్శించ బడు తుంది. ఈ నృత్యం గోవాలోని వ్యవసాయదారులలో చాలా ప్రజాదరణ పొందింది. మొత్తం పనితీరు నిర్మాణంలో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ప్రధాన పాత్ర పోషిస్తారు.ఈ నృత్యం యొక్క మరొక నమ్మకం ఏమిటంటే, ఇది యుద్ధభూమి నుండి తిరిగి వచ్చిన సైనికుల విజయాన్ని జరుపుకోవడానికి ప్రదర్శించబడుతుంది. కారణం ఏమైనప్పటికీ, స్వయంగా నృత్య ప్రదర్శన అత్యంత ఆకర్షణియంగా ఉంటుంది. [2]మార్చి లేదాఏప్రిల్‌లో వచ్చే అతిపెద్ద పండుగలలో షిగ్మో ఒకటి. సంగీతం, పాట మరియు నృత్యంతో జరుపుకునే వసంతోత్సవం ఈ షిగ్మొ. సంస్మరణలు గ్రామ కేంద్రాల నుండి పట్టణాలకు పెద్ద కవాతు చెస్తూ తరలివెళ్లాయి.అద్బుతమైన ప్రదర్శనలను తిలకించేందు కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు సూర్యుడు అస్తమించి, లైట్లు వెలిగిన తర్వాత అందంగా అకర్షణియంగా అలంకరించిన శకటాల కవాతు వీధుల్లో తిరుగుతుంది. సంగీతం సాధారణంగా ధోల్, తాషా మరియు కసాలే. సాధారణంగా ఉత్సవాలు గ్రామ మాండ్ చుట్టూ తిరుగుతాయి. మాండ్-దేవ్ మరియు జానపద ఆహారాలు సంప్రదాయాలలో ముఖ్యమైన భాగం.గోవా షిగ్మోలో రెండు రకాలు వున్నాయి: ధక్లా (చిన్న) మరియు థోర్లా (పెద్దది). మొదటిది తిస్వాడి, పోండా, కలంగుటే మరియు క్యూపెమ్‌లలో జరుపుకుంటారు, మరొకటి బార్డెజ్, సత్తారి, బిచోలిమ్ మరియు పెర్నెమ్‌లలో జరుపుకుంటారు.

నృత్యంలో, రోంబాట్ రూపం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నృత్యకారుల సమూహాలు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. విస్తృతమైన వస్త్రధారణ మరియు వివిధ రకాల వాయిద్యాలు ఈ రూపాన్ని ప్రత్యేకంగా చేస్తాయి.చారిత్రక మరియు హాస్య అంశాలు ఈ పండుగకు గొప్ప మరియు ప్రత్యేకమైనా అస్వాదన అందిస్తాయి.ఈ రెండు అంశాలు వీరమేల్, గాదె, ఘోడెమోడ్ని వంటి విభిన్న నృత్య రూపాల్లో స్పష్టంగా కనిపిస్తాయి..జాగోర్, రణమాల్యమ్, ఖేలే మరియు రోమాట్‌లలో హాస్య అంశాలు కనిపిస్తాయి. దాని ప్రకృతి ఆరాధన కారణంగా, ఈ నృత్యం శాంతగురు-కుటి, శాంతేరి, రావల్‌నాథ్, శాంతదుర్గ-దామోదర్ మరియు ఇతర దేవతలకు మరియు దేవతలకు అంకితం చేయబడింది. ఈ పండుగ గోవాలోని విభిన్న సాంస్కృతిక అంశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఈ నృత్యాలు చాలా వరకు గోవా అంతటా పట్టణాలలో జరిగే వివిధ షిగ్మో కవాతుల్లో ప్రదర్శించబడతాయి గోవా సంప్రదాయాలు సజీవంగా ఉండడంతో వీటిని ప్రత్యక్షంగా చూడడం అద్భుతమైన అనుభవం. ఈ వేడుకలన్నీ రంగుల పండుగ హోలీ యొక్క ఉన్మాద పతాకస్థాయిలో ముగుస్తాయి.[10]

9.కుంబీ నృత్యం(kunbi Dance)[మార్చు]

కుంబీ నృత్యం. మపుస.గోవా కార్నివల్

గోవా అనేక తెగలకు నిలయం.అందులో గిరిజన జనాభా రాష్ట్రంలో పెద్ద స్థలాన్ని ఆక్రమించింది. దీని ఫలితంగా గోవా విభిన్న జానపద సంస్కృతులు మరియు సంప్రదాయాల యొక్ అద్భుతమైన సమ్మేళనం కుంబీ నృత్యం గోవాలోని కుంబీ గిరిజన జనాభా చే మొదటగారూపొందించబడింది సాంఘిక సమావేశాలు, మతపరమైన సందర్భాలు మరియు పండుగలలో ఈ తెగకు చెందిన మహిళలు కుంబీ నృత్యం చేస్తారు. నృత్యం లో అనుసంధానం చేయబడి వివిద రీతుల్లో చేసిన సొగసైన మరియు మనసైన దశలు ఉంటాయి. ఈ నృత్యం చేస్తున్నప్పుడు ఈ మహిళలు నవ్వుతూ, ఆనందిస్తూ మరియు ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ఉర్రూత లూగించడం చూడవచ్చు, ఈ ప్రదర్శన మొత్తం అనుభవానికి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.[2]కుంబిలతెగ వాళ్ళు గోవాలోని తొలి స్థిరనివాసులు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.వారు హిందువుల, పోర్చుగీస్ కాలంలో క్రైస్తవ మతంలోకి మార్చబడిన సాల్సెట్ తాలూకాలో ఎక్కువగా స్థిరపడిన బలమైన గిరిజన సంఘం, ఇప్పటికీ భూమి యొక్క అత్యంత పురాతన జానపద సంప్రదాయాన్ని నిలుపుకున్నారు.ఈ తెగ వారు వ్యవసాయ తరగతికి చెందిన వారు, సాత్వికమైన మరియు కష్టపడి పనిచేసే వ్యక్తులుగా గుర్తించబడ్డారు. వారు 'కుటుంబ' అని పిలవబడే అనేక కుగ్రామాలలో సమూహంగా కలిసి నివసిస్తున్నారు, అయితే నేడు వారు ఇతర వెనుకబడిన తరగతి (OBC)గా వర్గీకరించబడ్డారు.

కుంబిలు కళ మరియు సంస్కృతి యొక్క గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు, వాటికి వారు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు. కుంబీ జానపద నృత్యం వారి తెగకు విలక్షణమైనది. సామాజిక ఇతివృత్తాలను చిత్రీకరించడానికి గోవాలో ప్రసిద్ధి చెందింది. ఈ కుంబి నృత్యం.పోర్చుగీసు పూర్వ పాలన నుండి గోవాలో తీవ్రమైన మార్పులను చూసినప్పటికీ, ఇప్పటి వరకు, కుంబీలు భూమి యొక్క పురాతన జానపద సంప్రదాయాలను కాపాడుకోగలిగారు.జానపద స్త్రీలు ప్రదర్శించే కుంబీ నృత్యం ఇందులో ఉందిఈ నృత్యం వేగంగా మరియు మనోహరంగా ఉంటుంది. కుంబి నృత్యంలోని పద కదలికలు సొగసైనవిగా చేయడానికి నృత్యకారుల భంగిమ కీలకమైనది. ప్రదర్శకులు రంగురంగుల దుస్తులను ధరిస్తారు, ఇది డిజైన్‌లో సరళమైనది మరియు తెగ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది.ట్టును చక్కగా బన్‌లో కట్టిన తర్వాత రంగురంగుల పూల దండలతో అలంకరించుకుంటారు. నెక్లెస్‌లు, చెవిపోగులు మరియు బ్యాంగిల్స్ వంటి వారి ఆభరణాలు సరళమైనవి అయినను సొగసైనవి. సాంప్రదాయ దుస్తులు ఈ జాతి కళారూపానికి రంగుల స్పర్శను అందిస్తాయి. కుంబీ నృత్యం సామాజిక సందర్భాలలో మాత్రమే ప్రదర్శించబడుతుంది.

కుంబీ హిందూ మతంలో ఒక భాగమని చాలా సాధారణ అపోహ ఉంది, మరియు పోర్చుగీస్ ప్రభావం తరువాత, వారు క్రైస్తవ మతంలోకి మార్చబడ్డారు. అయితే, ఈ కమ్యూనిటీ సభ్యులు హిందూమతం, జైనమతం, ఇస్లాం, బౌద్ధమతం సిక్కుమతం, క్రైస్తవం వంటి మతాలను ఆచరిస్తారు మరియు జాబితా కొనసాగుతుంది. కుంబీలు మరాఠాలు, కానీ మరాఠాలు కుంబీలు కాదు, అంటే కుంబీలు వారి గిరిజన ఆచారాలు మరియు సంప్రదాయాల ద్వారా వేరు చేయబడిన మరాఠాలలో ఒక నిర్దిష్ట తరగతి. [11]

10.రోమాట్ డ్యాన్స్(romat dance)[మార్చు]

రోమాట్ అనేది గోవా యొక్క ప్రత్యేకమైన నృత్య రూపం, ఇది నృత్యం మరియు వీధి ప్రదర్శనల కలయిక. ఈ నృత్యంలో నృత్యకారులు మరియు సంగీతకారుల బృందం ఊరేగింపు రూపంలో కదులుతుంది. ప్రదర్శన కోసం పెద్దడోల్లను మరియు తాళాలు వంటి వాయిద్యాలు ఉపయోగించబడతాయి. నృత్యకారులు జిలుగు జిలుగు మని మెరిసే రంగుల దుస్తులను ధరిస్తారు. ఊరేగింపు ముందుకు సాగుతున్నప్పుడు పెద్ద టెక్కము/పతాకం వంటివాటిని మరియు వివిధ ఉపమాన వ్యక్తీకరణలను కలిగి ఉన్న ఛత్రం లేదాగొడుగు వంటి వాటిని ఊరేగింపు గుండా జనం తీసుకు వెళతారు. ఇది గోవాలోని అత్యంత ప్రసిద్ధ నృత్య రూపాలలో ఒకటి. నృత్యాన్ని ప్రత్యక్షముగా వీక్షించ గలగడం, మరచి పోలేని ఒక మాధురానుభూతి జ్ణాపకంగా జీవితంలో వుండిపోతుంది.[2] [12]

11.గోఫ్ డ్యాన్స్(goff dance)[మార్చు]

గోవాలోని ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలలొ గోఫ్ నృత్యం ఒకటి. గోవాను పాలించిన పాలకులు మరియు రాజవంశాల యొక్క శక్తివంతమైన సాంస్కృతిక అనుబంధాల అనన్య సంగమం గోఫ్ నృత్యం . ఈ నృత్యాన్ని గోవాలోని రైతు సంఘం ప్రత్యేకంగా షిగ్మో పండుగ సమయంలో ప్రదర్శిస్తారు.పంట కాలంలో సమృద్ధిగా పండిన తరువాత గోవా రైతుల ఆనందం మరియు ఆనందాన్ని వ్యక్తపరిచే మార్గం ఈ నృత్య ప్రదర్శన. ప్రతి నర్తకి 'మాండ్' అని పిలువబడే నృత్య ప్రదేశంమధ్యలో నుండి వేలాడుతున్న రంగు రంగుల త్రాడును పట్టుకుని ఉంటుంది. నృత్యకారులు ఈ తాడులను నృత్యంచెస్తూ అందమైన, రంగు రంగుల మరియు సంక్లిష్టమైన జడ అల్లికను ఏర్పరుస్తారు.[2]

రిబ్బన్ డ్యాన్స్" అని కూడా గోల్ఫ్ నృత్యాన్ని పిలుస్తారు. ఈ నృత్యానికి గుజరాత్ రాష్ట్రంలోని గిరిజన నృత్య రూపాలతో అనుబంధం ఉంది. పండుగ సీజన్‌లో నృత్యం ఒక ప్రధాన ఆకర్షణ మరియు ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.ఈ నృత్యాన్ని మగ లేదా ఆడ సమూహం ప్రదర్శించవచ్చు. ఈ రకపు నృత్యాన్ని “జడ నృత్యం”అంటారు. ప్రతి నర్తకి ఒక రంగుల త్రాడును కలిగి ఉంటుంది, ఇది నృత్య ప్రదర్శన స్థలం అయిన 'మాండ్' మధ్యలో వేలాడ దీయబడుతుంది. నృత్యకారులు మొదటి కదలిక/మొదటి రౌండ్ ముగింపులో అందమైన, రంగురంగుల, జటిలమైన జడ అల్లిక వంటి అల్లికను ఏర్పరుచుకుంటూ సంక్లిష్టంగా నృత్యం చేయడం ప్రారంభిస్తారు.తిరిగి రెండో రౌడ్/రెండో అవ్రుత్తంలో సంగీతం మరోసారి ప్రారంభమవుతుంది. నర్తకులు రెండో పరి నృత్యం యొక్కరీతి లేదా మాదిరిని చాలా నైపుణ్యంతో మొదటి నర్తనకు వ్యతిరేక పద్ధతిలో చేస్తారు, రెండవ కదలిక చివరిలో, జడ అల్లిక బహిర్గతం చేయబడి, అన్నితాడులు మళ్లీ వదులుగా నృత్యంకు ముందు ఎలా వుండేవో అలా విడిగాఅవుతాయి.గోఫ్ డ్యాన్స్‌లో నాలుగు వేర్వేరు బ్రెయిడ్‌లు (తాడును జడలా అల్లడం) ఉన్నాయి. నృత్య ప్రదర్శన సమయంలో పాడే పాటలు ఎక్కువగా శ్రీకృష్ణునికి అంకితం చేయబడ్డాయి. ఈ నృత్యం లో ఘుమత్, సమేల్ మరియు సుర్తా శంసీ వంటి శ్రావ్యమైన సంగీత వాయిద్యాలు నృత్య ప్రదర్శనతో పాటు ఉంటాయి.ఈ జానపద నృత్యం యొక్క దుస్తులు వైవిధ్యంగా ఉన్నప్పటికీ అన్ని వేషధారణలు సాంప్రదాయకంగా ఉంటాయి. కొన్ని మగ సమూహాలు కుర్తాపైజామా మరియు కొన్ని కుర్తా ధోతీ ధరించడానికి ఇష్టపడతారు మరోవైపు, కొన్ని మహిళా నృత్య బృందాల మహిళలు ఘాగ్రా-చోళీ ధరించి ఉండగా, కొన్ని బృందాలుచీరలు ధరిస్తారు [13]

12.ముసల్ డ్యాన్స్(musal dance)[మార్చు]

గోవాలోని ముసల్ నృత్యం రాష్ట్రంలోని జీవనాధారమైన వ్యవసాయ మూలానికి నివాళులర్పించే మరొక మార్గం. 7వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు గోవా రాజధానిగా పనిచేసిన చంద్రపూర్ గ్రామం నుండి 11వ శతాబ్దం లో ఈ నృత్య సంప్రదాయం ఉద్భవించిందని నమ్ముతారు. నృత్య ప్రదర్శనలో పురాతన యుగాలలో యుద్ధంలో వాడరని చెప్పబడే ఆయుధాలను ఈ ధరించి నర్తిస్తారు ఇప్పటికీ. గోవాలోని క్షత్రియ యోధులు యుద్ధ సమయంలో ముసల్ ఆయుధాలను కలిగి ఉన్నారని,వాటితో శత్రువులపై యుద్దం చేశారని క్షత్రియులు నమ్ముతారు. యుద్ధాల సమయంలో సాధించిన విజయాలను స్మరించుకునేందుకు ఈ నృత్య రూపకాన్ని ఎంతో ఉత్సాహంతో ప్రదర్శిస్తారు. సాంప్రదాయకంగా ప్రదర్శించిన నృత్యంలో 22 ద్విపద పాటలు ఉంటాయి. [2]

'ముసల్లం ఖేల్' లేదా 'ముస్సోల్ నాచ్' (ముసల్ నృత్యం)ఒక పురాతన నృత్యం, ఇది గ్రామంలో జరుగుతుంది మరియు అనేక శతాబ్దాలుగా జరుగుతున్నది. 'ముస్సోల్' అనగా తెలుగులో రోకలి(pestle) అని అర్థం.అందుకే ఈ నృత్యంను రోకలి నృత్యం అనువదించుకోవచ్చు.ఇది చందోర్‌లోని క్రిస్టియన్ చార్డో (క్రిస్టియన్ క్షత్రియ) సామాజిక వర్గంచే ప్రదర్శించబడే రోకలి దంపుడు నృత్యం(pounding pestle dance).ఇది కార్నివాల్ యొక్క సోమవారం మరియు మంగళవారం జరుగుతుంది.డ్యాన్స్ సమయంలో, ప్రజలు ధోతీ, జాకెట్, పగ్డీ మరియు కాలి గజ్జెలు ధరిస్తారు. వృత్తాకార కదలికలో, చేతుల్లో రోకలిని పట్టుకుని నృత్యం చేస్తారు. వారు వృత్తంలో కదులుతున్నప్పుడు, రోకలి ఒక చివర వృత్తాకారం మధ్య వైపు చూపుతుంది. రోకలి ముందుకు వుంచి దాని వైపుఒక అడుగు ముందుకు,ఒకఅడుగు వెనక్కు వేస్తూ వృత్తాకారంగా తిరుగుతూ పాటలు ఆలపిస్తూ,నర్తిస్తారు.ఘుమోత్, జాంజే వాయిద్యాల వాయిద్యం అనుగుణంగా వారు నృత్యం చేస్తారు. ఘుమోత్ గోవా సంప్రదాయ సంగీత వాయిద్యం. ఇది పెర్కుషన్( గంటలు కొట్టడం,తాళం వేయడం,పళ్ళేలు కొట్టడం వంటి విధానం ) యొక్క పురాతన రూపం, [14]

13.ఘోడే మోడ్నినృత్యం(ghode modni dance)[మార్చు]

గోవాలోని ఈ జానపద నృత్యాన్ని ఘోడే మోడ్ని అని పిలుస్తారు, ఎందుకంటే నృత్యం విధానంగుర్రం యొక్క కదలికలను కలిగి ఉంటుంది. నకిలీ డమ్మీ గుర్రాన్ని ఉపయోగించడం ద్వారా ప్రదర్శించబడు తుంది, దాని లోపల రంధ్రం కత్తిరించ బడుతుంది మరియు నృత్యకారులు ఈ గుర్రాన్ని నృత్యం చేస్తున్నప్పుడు తీసుకువెళతారు. గోవాలో మరాఠాలు పోర్చుగీస్‌పై సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి మరియు స్మరించుకోవడానికి ఈ నృత్యం చేయబడింది. షిగ్మో పడుగ సందర్భంగా, స్థానికులు ఘోడే మోడ్ని నృత్యం కోసం ఎదురుచూస్తారు. అయితే కొన్నిప్రదర్శనలలో చెక్క గుర్రం కాకుండా, నృత్యకారులు సాంప్రదాయ రంగుల దుస్తులను ధరిస్తారు, మరాఠా యోధుల పాదాలకు కాలిగజ్జెలు. కడియాలు ఉంటాయి.[2]

ఇది గోవాలోని సటారి తాలూకాలోని మరాఠా పాలకులు పోర్చుగీస్‌పై రాణేయోధులు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రదర్శించె నృత్యం.ఒకప్పుడు మరాఠాలు పరిపాలించిన బిచోలిమ్,పెర్నెమ్ మరియు సతారీ తాలూకాలలో ఈ నృత్యం మరింత ప్రాచుర్యం పొందింది.ప్రదర్శన కోసం క్షత్రియ నృత్యకారులు రంగు రంగుల పువ్వులతో తయారు చేసిన భారీ శిరస్త్రాన్ని ధరిస్తారు.చెక్క గుర్రాలను కూడా అందంగా తయారు చేసి, మచ్చలేని తెల్లని దుస్తులతో అలంకరిస్తారు. చీలమండల మీద ఘుంగుర్లు/గజ్జెల పట్టీలు కట్టకుంటారు. నృత్యం యొక్క సాధారణ దశలతోప్రదర్శన ప్రారంభమవుతుంది. ఒక చేతిలో కంచెను ఊపుతూ, మరో చేతిలో కత్తిని ఊపుతూ, నర్తకి డ్రమ్స్ ధోల్, తాషాల వాద్య సంగీతానికి సింబల్స్‌లో ముందుకు వెనుకకు అడుగులు వేస్తు నర్తిస్తాడు. ప్రాథమికంగా, గోవాన్ యోధుల ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ఘోడే మోదిని నృత్యంగా ప్రదర్శింపబడుతుంది.వార్షిక కార్నివాల్ సీజన్లలో ఈ నృత్యం ప్రత్యేక ఆకర్షణ. [15]

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "goan folk ddances". hinterscapes.com. Retrieved 2024-02-21.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 "folk dances of goa". namasteindiatrip.org. Retrieved 2024-02-21.
  3. "Dhalo dance of goa". auchitya.com/. Retrieved 2024-02-21.
  4. [ttps://www.goaholidayhomes.com/information/corredinho.html "corredinho"]. goaholidayhomes.com. Retrieved 2024-02-21.
  5. "dhekini dance". itsgoa.com/. Retrieved 2024-02-21.
  6. "fugdi dance". gosahin.com. Retrieved 2024-02-21.
  7. "lamp dance". indianetzone.com. Retrieved 2024-02-21.
  8. "dhangar dance". goaholidayhomes.com. Retrieved 2024-02-21.
  9. "dashavatara dance of goa". indianetzone.com. Retrieved 2024-02-21.
  10. "shigmo". goa-tourism.com. Retrieved 2024-02-21.
  11. "kumbi tribal facts". itsgoa.com. Retrieved 2024-02-21.
  12. "what is the romat folk danc of goa". windowshopgoa.com. Archived from the original on 2024-02-22. Retrieved 2024-02-21.
  13. "golf dance". indianetzone.com. Retrieved 2024-02-21.
  14. "mussol khel:steeped in tradition". gomantaktimes.com. Retrieved 2024-02-21.
  15. "ghodemodni". folkdancesingoa.blogspot.com. Retrieved 2024-02-21.